Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 10

"Sumantra tells story of Rishyasrumga (2)"

With Sanskrit text in Devanagari , Telugu and Kannada


సుమంత్రశ్చోదితోరాజ్ఞా ప్రోవాచేదం వచః తథా |
యథర్శ్యశృంగస్త్వానీతః శృణు మే మంత్రిభిః సహ ||

'రాజ ప్రోత్సాహముతో సుమంత్రుడు ఇట్లు చెప్పసాగెను. " ఓ రాజా రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుని రప్పించిన రీతిని తెల్పుదను వినుడు"

బాలకాండ
పదియవ సర్గ

రాజ ప్రోత్సాహముతో సుమంత్రుడు ఇట్లు చెప్పసాగెను. " ఓ రాజా రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుని రప్పించిన రీతిని తెల్పుదను వినుడు"

రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుని రప్పించిన రీతిని తెలుపుచూ సుమంత్రుడు చెప్పిన మాట:

ఆమాత్యులతో గూడియున్న రోమపాదునితో, రోమపాదుని పురోహితుడు ఇట్లు పలికెను. 'మేము అలోచించిన ఉపాయము వలన ఎట్టి అపాయము జరుగదు ".

"ఋష్యశృంగుడు వనమునందు నివసించువాడు.అతడు తపస్సునందు వేదాధ్యయనమందు నిమగ్నుడైవుండును. అతడు సుఖములగురించి స్త్రీవిషయలగురించి జ్ఞానములేనివాడు . మానవుల మనస్సు ఇంద్రియములను ఆకర్షించు విషయముల ద్వారా అయనను పురమునకు శీఘ్రముగా రప్పింతుము. అలంకరించుకున్న రూపవతులైన గణికలను అచటికి పంపుదము. వారు అచటికి వెళ్ళి వివిధోపాయములతో మరియు బహుమానములతో ఆకర్షించి తీసుకువచ్చెదరు".

అది విని రాజు పురోహితునితో అట్లే జరుగుగాక అని చెప్పెను. పిమ్మట మంత్రులు పురోహితుడూ ఆవిధముగనే చేసిరి. ఆ ఆదేశమును విని వారాంగనలు ఆ మహావనమున ప్రవేసించిరి. ఆ ఆశ్రమమునకు సమీపముగా చేరి ఋషి దర్శనమునకు ప్రయత్నము చేయసాగిరి.

ఆ ధీరుడైన ఋష్యశృంగుడు ఏల్లప్పుడూ ఆశ్రమములో నుండువాడు. పితృసేవలో నిమగ్నుడై అతడు ఆ ఆశ్రమము విడిచి ఎప్పుడూ పోలేదు. ఆ తపస్వి పుట్టినదినమునుంచి స్త్రీలను గాని పురుషులను గాని నగరములకు గ్రామములకు సంబంధించిన మరో ప్రాణులను చూడలేదు.

పిమ్మట ఒకనొకప్పుడు ఆ విభండకసుతుడు అనుకోకుండా వారాంగనులు ఉన్న చోటికి వచ్చి ఆ వారాంగనలను చూచెను. చిత్ర విచిత్ర వేషములను ధరించివున్న ఆ వారాంగనలు మధుర స్వరములతో పాడుచూ ఆ ఋషిపుత్రుని సమీపించి ఇట్లు పలికిరి. " ఓ బ్రాహ్మణోత్తమా నీవు ఎవరవు ? ఇచటవుండుటకు కారణమేమి ?ఈ నిర్జనమైన ఘోరారణ్యములో ఓంటరిగా తిరుగుటకు కారణమేమి? మేము వినగోరుచున్నాము".

ఆ తపస్వి ఇదివరలో ఎప్పుడునూ అట్టి సుందరరూపములుగల వన స్త్రీలను చూడనైవాడై ఆ సంతోషములో తనతండ్రిని గురించి వారితో చెప్పదలచెను." నా తండ్రి బిభండక మహర్షి . నేను ఆయన ఔరస పుత్రుడను. ఋష్యశృంగుడను పేరు గలవాడను. ఈ వనమున తపోజీవనము సుప్రసిద్ధము. ఓ శుభదర్శనులారా ఈ సమీపమునే మా ఆశ్రమము గలదు. అచటికి రండు. అచట విధివిధానముగా మీఅందరినీ పూజింతును".

ఆయన వచనములను విని వారందరికిని రిష్యశ్రుంగుని ఆశ్రమము చూడ కోరిక కలిగెను. అంతట వారు ఆయనతో గూడి ఆ ఆశ్రమమునకు వెళ్ళిరి . ఆ అశ్రమమునకు వచ్చిన వారందరికీ అతడు అర్ఘ్యపాదములను కందమూల ఫలములను ఒసగి ఆదరించెను.

ఆయన పూజలను స్వీకరించి ఉత్సాహము గలవారైనప్పటికీ విభండకముని అచటికి వచ్చునను భయముతో వారు తెచ్చిన ఫలములనిచ్చి అచ్చటనుండి వెడలి త్వరగా పోదలిచిరి. "ఓ ద్విజోత్తమా మా యొక్క ముఖ్యమైన ఫలములను స్వీకరింపుడు. నీకు శుభమగును . ఆలసింపక ఆరగించుడు "అని వారందరునూ ఆయనను సంతోషముతో కౌగిలించికొని వివిధరకములైన భక్ష్యములను సమర్పించిరి.

ఆ తేజస్వి ఆ ఫలములను భక్షించి ఆ వనములో నివశించువారెవ్వరూ పూర్వము భక్షింపబడని ఫలములని గ్రహించెను.ఆ గణికలు అతని తండ్రి్ భయముతో , తాము చేయుచున్న వ్రతములగురించి చెప్పి ఆ వ్రతముచేయుటకు పోవలనని కారణముతో వెళ్ళ సాగిరి.

వారందరునూ వెళ్ళిపోగా ఆ కాశ్యపాత్ముజుడైన ఆ తపస్వి వ్యాకులచిత్తముతో మిక్కిలి దుఃఖపడెను. పిమ్మట మరుసటి దినమున ఆ తపస్వి ఎచట అందముగా అలంకరిచుకున్న వారాంగనలను చూచెనో ఆదే ప్రదేశమునకు వచ్చెను. అటుల వచ్చుచున్న ఆ బ్రాహ్మణకుమారుని చూచి వారు సంతోషముతో పొంగి పోయి ఆయనను సమీపించి ఇట్లు పలికిరి.

"ఓ మహాత్మా మా ఆశ్రమమునకు విచ్చేయుడు అచట ఇచ్చటి కంటెను ఘనముగా మీకు సత్కారము జరుగును" అని. హృదయము స్పందించు నట్టి వారి మాటలను విని అతడు వారి వెంట పోదలిచెను. ఆ వారాంగనలు ఆయనను తమవెంట తీసుకొని వెళ్ళిరి.

ఆ మహాత్ముడు అచటికి వచ్చిన క్షణములోనే ఆ దేశములో వరుణదేవుడు లోకమునకు ఆహ్లాదము కలిగించునటుల వర్షములు కురిపించెను. తమ దేశమునకు వర్షము తీసుకువచ్చిన విప్రునకు ఎదిరేగి భువి పై సాగిలపడి శిరస్సుతో అభివాదము చేసెను. ఆ రాజు భక్తి శ్రద్ధలతో ఆ మునికి అర్ఘ్యపాద్యములను సమర్పించి " ఓ మునీశ్వరా వారాంగనలద్వారా ఆకర్షించి మిమ్ములను ఇక్కడికి రప్పించినందుకుఆగ్రహపడక మమ్ము అనుగ్రహింపుడు " అని !
పిమ్మట అంతః పురమున ప్రవేశించి ఆ రాజు మనసా తన కుమార్తె యగు శాంతను అయనికి ఇచ్చి యథావిథముగా వివాహమొనర్చి ఆనంద భరితుడాయెను . మహాతేజోవంతుడగు ఋష్యశృంగుడు గౌరవాదరమునలను అందుకోనుచూ భార్య అయిన శాంతతో కలిసి సర్వసుఖములతో నివసింపసాగెను.


||వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమందలి బాలకాండలో పదియవ సర్గ||
|| సమాప్తము ||

ఏవం స న్యవసత్ తత్ర సర్వకామైః సుపూజితః |
ఋష్యశృంగో మహాతేజా శాంతయా సహ భార్యయా ||

మహాతేజోవంతుడగు ఋష్యశృంగుడు గౌరవాదరమునలను అందుకోనుచూ భార్య అయిన శాంతతో కలిసి సర్వసుఖములతో నివసింపసాగెను.

|| om tat sat ||